TSPSC Group-4: గ్రూప్-4 రాతపరీక్ష నిర్వహణపై హైకోర్టు కీలక తీర్పు
తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ నిర్వహించనున్న గ్రూప్-4 రాత పరీక్షల నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. పరీక్షలు నిలిపివేస్తే అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురవుతాయని రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ చేసిన వాదనలతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. యధావిధిగా పరీక్షలు నిర్వహించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది.
గ్రూప్-3, గ్రూప్-4లో ఉన్న టైపిస్ట్ కం అసిస్టెంట్ పోస్టులను ముందుగా ప్రకటించిన బోర్డు ఆ తర్వాత వాటిని తొలగించారని హైకోర్టులో 101 మంది అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. పరీక్షల నిర్వహణపై స్టే ఇవ్వాలని కోరారు. అయితే స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇదే సందర్భంగా పిటిషనర్ల అభ్యంతరాలపై టీఎస్పీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూలై 13 కి వాయిదా వేసింది.
తెలంగాణ రాష్ట్రంలో 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను 2023 జూలై 1న టీఎస్పీఎస్సీ నిర్వహించనుంది. ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి 5 వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించనున్నారు. అలాగే గ్రూప్-4 ఉద్యోగాలకు 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 116 మంది పోటీ పడుతున్నారు.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి