TSPSC: గ్రూప్-3 ఒక్కో పోస్టుకు 390 మంది పోటీ.. ఎన్ని లక్షల మంది దరఖాస్తు చేశారంటే?
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 ఉద్యోగాల దరఖాస్తు గడువు గురువారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. మొత్తం 1,375 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తు గడువు ముగిసే సమయానికి 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 390 మంది పోటీ పడనున్నారు. చివరి 24 గంటల్లో 58,245 దరఖాస్తులు వచ్చాయి.
త్వరలోనే గ్రూప్-3 పరీక్ష తేదీలు ఖరారు
గ్రూప్ 3 సర్వీసు పోస్టుల దరఖాస్తు గడువు ముగియడంతో త్వరలోనే పరీక్ష తేదీలు ఖరారు చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే ఖరారైన పోటీ పరీక్షల షెడ్యూలును పరిశీలిస్తోంది. త్వరలోనే గ్రూప్-3 పరీక్ష తేదీలను ప్రకటించనుంది.