Police Jobs: హోంశాఖలో 84,866 ఉద్యోగ ఖాళీలు
కేంద్ర సాయుధ బలగాల్లో 84,866 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగం, సరిహద్దు భద్రతా దళం వంటి ఆరు కేంద్ర సాయుధ బలగాల పూర్తి సామర్థ్యం 10,05,520 కాగా, వాటిలో కేవలం 84,866 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని, వాటిని మాత్రమే భర్తీ చేయాల్సి ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బుధవారం రాజ్యసభలో చెప్పారు. వీటిలో గత 5 నెలల్లో 31 వేలకు పైగా సిబ్బందిని భర్తీ చేశామన్నారు. 2023 జనవరి 1 నాటికి సీఆర్పీఎఫ్ విభాగంలో 29 వేలకుపైగా పోస్టులు, బీఎస్ఎఫ్ విభాగంలో 19 వేలకుపైగా పోస్టులు, సీఐఎస్ఎఫ్ విభాగంలో 19 వేలకుపైగా పోస్టులు, సశస్త్ర సీమాబల్ విభాగంలో 8 వేలకు పైగా పోస్టులు, ఐటీబీపీలో 4 వేలకుపైగా పోస్టులు, అస్సాం రైఫిల్స్ విభాగంలో 3 వేలకు పైగా పోస్టులు ఖాళీలున్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగాల భర్తీకి రాబోయే రోజుల్లో నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు.