TS SI Constable: ఒక్కో పోస్టుకు ఆరు మంది పోటీ.. 18 కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకొంది. ఇటీవలే మెయిన్స్ పరీక్షల ఫలితాల్ని వెల్లడించిన తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్ఎ) తదుపరి అంకంపై దృష్టి సారించింది. తుది రాతపరీక్షలో ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనలో నిమగ్నమైంది. ఈసారి 17,516 పోస్టుల భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు 1.09 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు సగటున ఆరు మంది పోటీ పడుతున్నారు. పోలీస్ యూనిట్ల వారీగా ఉన్న ఖాళీల ఆధారంగా ఆయా జిల్లాల్లో పోటీ పడుతున్న అభ్యర్ధుల్ని ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం కటాఫ్ మార్కులే ప్రాతిపదిక కానున్నాయి. జిల్లాల్లో పోస్టులకు అనుగుణంగా.. సామాజిక వర్గాల వారీగా ఖాళీల ఆధారంగానే కటాఫ్ మార్కుల్ని నిర్ణయించి, ప్రాధాన్యక్రమంలో ఎంపిక చేయనున్నారు.
ప్రస్తుతం అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కోసం రాష్ట్రవ్యాప్తంగా 18 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో పలు కేంద్రాలతో పాటు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఇవి ఉండనున్నాయి. ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా చేపట్టాలనే ప్రణాళికల్లో ఉన్నారు. మొత్తం 1.09 లక్షల మంది యొక్క ధ్రువపత్రాల్ని పరిశీలించాల్సి ఉండటంతో ఒక్కో కేంద్రంలో రోజుకు సగటున 500-600 మంది అభ్యర్థులను పిలవాలని నిర్ణయించారు. అలా ఈ ప్రక్రియను 10-12 రోజుల్లోగా పూర్తి చేయాలని మండలి వర్గాలు భావిస్తున్నాయి. జూన్ చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉంది.
ప్రతి రోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి