AP: గ్రామ, వార్డు సచివాలయాల్లో 14,000 పోస్టులకు నోటిఫికేషన్.. ఏప్రిల్ లో రాతపరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి మూడో విడత నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈసారి ఉద్యోగ నియామక రాత పరీక్షలను పూర్తిస్థాయి ఆన్లైన్ విధానంలో చేపట్టాలని యోచిస్తోంది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసి, ఏప్రిల్ నెలలోపు పరీక్షలు నిర్వహించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ జారీతో పాటు వీలైనంత త్వరగా నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న, ఇంకా మిగిలిపోయిన ఉద్యోగాల భర్తీకి ఇప్పుడు మరో విడత మూడో నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈసారి కూడా ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖకు అప్పగించింది. అయితే, గత రెండు విడతల్లో ఉద్యోగ నియామక రాత పరీక్షలను పూర్తిస్థాయి Offline విధానంలో నిర్వహించగా, ఈ విడతలో మాత్రం ఆన్లైన్ విధానంలో నిర్వహణకు పంచాయతీరాజ్ శాఖ కసరత్తు చేస్తోంది.
గ్రామ, వార్డు సచివాలయం సిలబస్ డౌన్లోడ్
గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 20 రకాల కేటగిరీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎనర్జీ అసిస్టెంట్ల కేటగిరీ ఉద్యోగాలు మినహా మిగిలిన 19 కేటగిరీ ఉద్యోగాల భర్తీ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరిగే రాత పరీక్షల ద్వారా భర్తీ చేస్తున్నారు. ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులను విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్నారు. తొలి విడత, రెండో విడతల నోటిఫికేషన్ల సమయంలో 19 కేటగిరీ ఉద్యోగాల భర్తీకి 14 రకాల రాత పరీక్షల ద్వారా నియామక ప్రక్రియ కొనసాగింది. కేటగిరి 1 పోస్టులు అయినటువంటి గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శి, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీస్ ఉద్యోగాలకు కలిపి ఉమ్మడిగా ఒకే రాత పరీక్ష నిర్వహించారు. గ్రేడ్ 2 వీఆర్వో, విలేజ్ సర్వేయర్ ఉద్యోగాలకు ఉమ్మడిగా మరో రాత పరీక్ష నిర్వహించారు. మిగిలిన 12 కేటగిరీ ఉద్యోగాలకు వేర్వేరుగా 12 రకాల రాత పరీక్షలు నిర్వహించారు.
ప్రస్తుతం మూడో విడతలో 19 కేటగిరి ఉద్యోగాలకు వేర్వేరుగా 19 రకాల పరీక్షల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. భవిష్యత్తులో ఆయా కేటగిరీ ఉద్యోగాల్లో తక్కువ సంఖ్యలో ఖాళీలు ఏర్పడినప్పుడు కూడా మరో కేటగిరి ఉద్యోగ ఖాళీల గురించి వాటి భర్తీని ఆలస్యం చేసే అవకాశం లేకుండా ఒక్కొక్క దానికి వేరుగా పరీక్షల నిర్వహణ మంచిదని అధికారులు ఈ దిశగా నిర్ణయం తీసుకుంటున్నారు.