TSPSC | ఒక్కో పోస్టుకు 2,005 మంది పోటీ, డీఏవో పోస్టులకు భారీ దరఖాస్తులు
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉద్యోగార్థులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలనే తపనతో అర్హత కలిగిన ప్రతి ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నారు. సాధారణ డిగ్రీ అర్హతగా ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి. తెలంగాణ తొలి గ్రూప్-1 ప్రకటన కన్నా కొన్ని పోస్టులకు అధిక పోటీ ఉంది. ఇటీవల టీఎస్పీఎస్సీ ద్వారా దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన పోస్టులలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గ్రేడ్-2 పోస్టులకు పోటీ భారీగా ఉంది. 53 డిఏఓ పోస్టులకు గాను 1,06,263 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో పోస్టుకు అత్యధికంగా 2,005 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఉద్యోగాలకు వేతన స్కేలు రూ.45,960 నుంచి రూ.1,24,150 ఉద్యోగార్థులను ఆకర్షించింది. 2022 సెప్టెంబర్ నెలలో ఈ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. ఇక పరీక్షలు నిర్వహించడమే తరువాయి. ఈ పోటీలో నెగ్గాలంటే పకడ్బందీ ప్రణాళికతో చదవాలి.