TSLPRB: తెలంగాణ ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు BIG ALERT
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ల రీకౌంటింగ్/ రీ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది. అన్ని పరీక్షలకు కలిపి రీకౌంటింగ్/ రీ వెరిఫికేషన్ కు 1,338 దరఖాస్తులు వచ్చినట్లు తెలంగాణ పోలీస్ నియామక మండలి (TSLPRB) తెలిపింది. ఫలితాలు ఆయా అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో ఈ నెల 6 నుంచి అందుబాటులో ఉంచుతామని తెలిపింది.
ఎడిట్ ఆప్షన్ (చివరి అవకాశం)
ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ దరఖాస్తులో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకునేందుకు చివరి అవకాశం ఇస్తున్నట్లు TSLPRB తెలిపింది. దరఖాస్తులలో తప్పుల సవరణకు ఈనెల 6 నుంచి 8న రాత్రి 8 గంటల వరకు అవకాశం కల్పించినట్టు వెల్లడించింది. ఈ తప్పులను మూడు రకాలుగా విభజించారు. ‘ఏ’ కేటగిరి తప్పులను నియామక మండలి ఉద్యోగుల సమక్షంలో మాత్రమే సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. ఇందులో అభ్యర్థి పేరు, జెండర్, కులం, స్థానికత, ఫోటో, సంతకం, వయస్సు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, క్రీడలకు సంబంధించిన రిజర్వేషన్ పొందడం వంటి అంశాలు ఉంటాయి. ‘బి’ కేటగిరి తప్పులను ధ్రువపత్రాల పరిశీలన సమయంలో సంబంధిత ఎస్పీ, కమిషనర్ల సమక్షంలో సరిదిద్దుకోవచ్చు. అభ్యర్థి ఇంటిపేరు, ఆధార్ నెంబర్, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ వంటివి ఈ ‘బి’ కేటగిరి తరగతిలో ఉంటాయి. ఇక అభ్యర్థి లాగిన్ ఐడి వంటివి ‘సి’ కేటగిరి కిందకి వస్తాయని, వీటిని ఇప్పుడు సరిదిద్దుకోవడం సాధ్యం కాదని తెలిపింది. ‘ఏ’ కేటగిరి తప్పులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.3000, ఇతరులు రూ.5000, ‘బి’ కేటగిరి తప్పులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2000, ఇతరులు రూ.3000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమకు కేటాయించిన వ్యక్తిగత లాగిన్ ఐడి ద్వారా నిర్ణీత తేదీల్లో ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థులు ఆ కాపీని ప్రింట్ తీసుకొని, ధ్రువపత్రాల పరిశీలన సమయంలో తమ వెంట తీసుకెళ్లాలి. తప్పులు దొర్లినట్లు భావిస్తున్న వాటికి సంబంధించిన ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాల్సి ఉంటుంది.
త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్
త్వరలోనే ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభిస్తామని పోలీసు నియామక మండలి (TSLPRB) తెలిపింది. 2014 జూన్ 2 తర్వాత జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలనే పరిగణనలోకి తీసుకొంటామని తెలిపింది. 2021 ఏప్రిల్ 1 తర్వాత అభ్యర్థులు తీసుకొన్న నాన్ క్రీమీలేయర్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లనే అంగీకరిస్తామని స్పష్టం చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం కటాఫ్ మార్కులు ప్రకటించే అవకాశం ఉన్నట్టు విశ్వనీయంగా తెలిసింది. అనంతరం కటాఫ్ మార్కులు, అభ్యర్థుల రిజర్వేషన్, ఇతర కేసుల వెరిఫికేషన్ పూర్తవ్వగానే ఎంపికైన అభ్యర్థుల తుది మెరిట్ జాబితాను ప్రకటించనుంది.
క్రింది లింక్ పై క్లిక్ చేసి పోలీస్ నియామక మండలి విడుదల చేసిన ప్రెస్ నోట్ చేసుకోగలరు
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి