TS Police Jobs 2023 | ఎస్ఐ, కానిస్టేబుల్ మెయిన్స్.. ఒక్కో పోస్టుకు ఎంత మంది పోటీ పడుతున్నారంటే?
తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది అంకానికి చేరింది. కానిస్టేబుల్ , ఎస్ఐ పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షలు, ఫిజికల్ ఈవెంట్లు ముగియగా మెయిన్స్ పరీక్షలపై అభ్యర్థులు దృష్టి సారించారు. ఫైనల్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను కూడా పోలీసు నియామక మండలి (TSLPRB) విడుదల చేసింది. పోలీసు ఫిజికల్ ఈవెంట్లకు రాష్ట్రవ్యాప్తంగా 1,11,209 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తంగా 53.70 శాతం మంది క్వాలిఫై అయ్యారు. ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు మార్చి 12 నుంచి మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 8, 9 తారీకుల్లో సివిల్ ఎస్ఐ నియామక పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్ 23న సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా తాజా నోటిఫికేషన్లలో కీలకమైన సివిల్ కానిస్టేబుల్ పోస్టు కోసం తలపడుతున్న అభ్యర్థుల్లో పోటీ తక్కువగా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకొంది. ప్రస్తుతం పోటీలో ఉన్న ప్రతీ ఆరుగురిలో ఒకరికి ఉద్యోగం దక్కే అవకాశముండటం గమనార్హం. కానిస్టేబుల్ పోస్టుల్లో సివిల్ విభాగానికి సంబంధించే అత్యధిక ఖాళీలు ఉన్నాయి. మరోవైపు ఎస్ఐ పోస్టులకు మాత్రం తీవ్ర పోటీ నెలకొంది. TSLPRB మొత్తం 16,969 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే కీలకమైన సివిల్ విభాగంలోనే 15,644 పోస్టులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9,54,064 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు . వీరిలో ప్రిలిమినరీ పరీక్ష , ఫిజికల్ ఈవెంట్ల తర్వాత తుది పరీక్షలకు 90,488 మంది మాత్రమే మిగిలారు. ఈ లెక్కన ప్రతి ఆరుగురిలో ఒకరికి కానిస్టేబుల్ కొలువు దక్కే అవకాశం ఉంది. కాస్త కష్టపడి చదివితే ఉద్యోగం సాధించడం కష్టమేమీ కాదు. కానిస్టేబుళ్ల కొలువుల కోసం పోటీ తక్కువగా ఉండగా ఎస్ఐ కొలువుల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. ఎస్ఐ సివిల్ విభాగంలో 554 పోస్టులు ఉండగా ఒక్కో పోస్టుకు 95 మంది పోటీ పడుతున్నారు.