TS Govt Jobs: తెలంగాణలో మరో 11,012 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు సిద్ధం
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. మరో 11,012 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాల్లో బోధన పోస్టుల భర్తీకి ఈ నెలాఖరులోగా గురుకుల నియామక బోర్డు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనుంది. గురుకులాల్లో ఇప్పటికే 11,012 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసి, రాతపరీక్ష నాటికి ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో అదనంగా మంజూరు కానున్న పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఈ పోస్టుల కోసం లక్షల్లో దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్న గురుకులబోర్డు ఆ మేరకు సర్వర్ పై ఒత్తిడిని తొలగించే పనిలో నిమగ్నమైంది. గురుకులాల్లో పోస్టుల భర్తీకి మార్చి మొదటి వారంలోనే నోటిఫికేషన్ ఇవ్వాలని భావించినప్పటికీ.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం గురుకుల సొసైటీలు ఉద్యోగ ప్రకటనల జారీకి అవసరమైన సమాచారాన్ని గురుకులబోర్డుకు అందజేశాయి. ఈమేరకు మార్చి నెలాఖరు నాటికి ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని బోర్డు భావిస్తోంది. ఉద్యోగార్థులు గురుకుల పోస్టులకు సన్నద్ధమయ్యేందుకు.. ప్రకటన వెలువడినప్పటి నుంచి రాతపరీక్ష నిర్వహణ తేదీకి మధ్య కనీసం నాలుగు నెలల వ్యవధి ఉండాలని భావిస్తోంది. నోటిఫికేషన్లు విడుదల చేసిన తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు కనీసం నెల రోజుల గడువు ఇవ్వనుంది.