1,29,929 కానిస్టేబుల్ ఉద్యోగాలకు రాత పరీక్ష తెలుగులో నిర్వహణ.. వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) నియామకాల కోసం నిర్వహించే పరీక్షను హిందీ, ఇంగ్లిష్ తోపాటు ఇక మీదట తెలుగు భాషలో కూడా నిర్వహించనుంది. హిందీ, ఇంగ్లీష్ తో పాటు కొత్తగా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఈమేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. 1,29,929 కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ ఉద్యోగాల భర్తీకి ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షల ప్రశ్నపత్రాన్ని హిందీ, ఇంగ్లీష్ భాషలకు తోడుగా అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళ, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషలలో రూపొందిస్తారు. ఈ నిర్ణయం వలన ఈ పరీక్షలో పాల్గొనే లక్షలాది మంది తమ మాతృభాష/ప్రాంతీయ భాషలో పరీక్ష రాసే అవకాశం రావటం, తద్వారా వారు ఎంపికయ్యే అవకాశం మెరుగుపడటం జరుగుతాయి.
దేశ వ్యాప్తంగా లక్షలాదిమందిని ఆకర్షిస్తూ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించే ప్రధాన పరీక్షలలో కానిస్టేబుల్ జీడీ ఒకటి. 2024 జనవరి 1 నుంచి హిందీ, ఇంగ్లిష్ తో పాటు 13 ప్రాంతీయ భాషలలో ఈ పరీక్ష జరుగుతుంది. కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో స్థానిక యువత భాగస్వామ్యాన్ని పెంచడానికి, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడానికి వీలుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ తెలిపింది.