TS Police Jobs: ఆఖరి దశలో కొంతమంది ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకున్న తరుణంలో కొందరు అభ్యర్థులకు చేదు అనుభవం ఎదురవుతోంది. ప్రాథమిక రాతపరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షలు, తుది రాతపరీక్షల్లో నెగ్గుకొచ్చిన తర్వాత అభ్యర్థిత్వం చెల్లదంటూ పోలీస్ నియామక మండలి తిరస్కరించడం పలువురు అభ్యర్థులకు ఆందోళన కలిగిస్తోంది. వారి వయసు మీరడమే ఇందుకు కారణమని తెలంగాణ పోలీస్ నియామక మండలి చెబుతుండగా.. తొలి దశలోనే ఎందుకు అభ్యంతరం చెప్పలేదని తిరస్కారానికి గురైన పలువురు అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. నెలల తరబడి కష్టపడి.. అన్ని దశల్ని దాటి వచ్చిన తర్వాత తమ అభ్యర్థిత్వాన్ని తొలగించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు పోలీసు నియామక మండలికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఎంపిక ప్రక్రియలో తుది అంకమైన ధ్రువీకరణ పత్రాల పరిశీలన క్రమంలో ఇలా అభ్యర్థిత్వాల్ని రద్దు చేస్తుండటం వివాదానికి దారితీస్తోంది.
వాస్తవానికి పోలీసు నియామక మండలి ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్లో అభ్యర్థుల వయసు అర్హతల గురించి స్పష్టంగా పేర్కొన్నారు. నిర్ణీత వయసుకు లోబడినవారే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. దరఖాస్తు సమయంలోనే ధ్రువీకరణ పత్రాల్ని వడబోయడం శ్రమతో కూడుకున్నది కావడంతో వయసు సహా అన్ని ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను మండలి చివర్లో చేపట్టింది. తొలి దశలో అయితే లక్షల సంఖ్యలో దరఖాస్తులుంటాయని.. తుది దశకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల్ని పరిశీలిస్తే సరిపోతుందని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఆన్లైన్లో అభ్యర్థులు దరఖాస్తు చేసిన సమయంలో నిర్ణీత వయసు లేకున్నా ఆమోదించడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. నిర్ణీత వయసు లేనివారు దరఖాస్తు చేసినప్పుడే తిరస్కరణకు గురైతే ఇబ్బంది ఉండేది కాదు. ఆమేరకు వెబ్సైట్లో సాంకేతికంగా మార్పు చేసి ఉండాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Telegram Group Link
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి