TSPSC Group-2: ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం
TSPSC Group-2: తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 రాతపరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో గ్రూప్-2 పరీక్షా కేంద్రాలకు కేటాయించిన ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీలు, స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యధావిధిగా మిగతా ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్, కాలేజీలు నడుస్తాయని స్పష్టం చేసింది.
వివిధ ప్రభుత్వ విభాగాల్లో 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో టీఎస్పీఎస్సీ నిర్వహించనుంది. 29వ తేదీ ఉదయం పేపర్-1 (జనరల్ స్టడీస్), మధ్యాహ్నం పేపర్-2 (చరిత్ర, రాజకీయం, సమాజం) పరీక్ష జరగనుంది. అలాగే 30వ తేదీ ఉదయం పేపర్-3 (ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి), మధ్యాహ్నం పేపర్-4 ( తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం) పరీక్ష జరగనుంది. ఒక్కో పేపర్ లో 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కోమార్కు. నాలుగు పేపర్లలో కలిపి 600 మార్కులు ఉంటాయి. రాత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గ్రూప్-2 ఉద్యోగాలకు భారీ స్థాయిలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీ పడుతున్నారు.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి